top of page

తెలుగు ఇంద్ర గీతం

Telugu

Telugu

Bhagavan Indra - The Supreme Sovereign Of The Universe

ఇంద్ర గీతము – సంక్షిప్త పరిచయం


ఇంద్ర గీతము, అనేది కావ్యకంఠ వాసిష్ట శ్రీ గణపతి ముని తెలుగులో ప్రత్యేకంగా రచించిన గంభీరమైన ఆధ్యాత్మిక గీతం. ఇందులో ఇంద్రుడు కేవలం వేదాలలో వర్ణించబడే దేవతల రాజుగానే కాకుండా, సమస్త విశ్వంలో అంతర్యామిగా విరాజిల్లే దివ్యచైతన్యస్వరూపుడిగా దర్శించబడుతున్నాడు.


ఈ గీతంలో పరబ్రహ్మము మరియు ఇంద్రతత్త్వము మధ్య సంబంధం, నిర్గుణ–సగుణ స్వరూపాల భేదాభేదం, శక్తి–శక్తిమంతుల ఏకత్వం, ఇంద్రుని విశ్వవ్యాప్త విభూతులు వంటి గంభీరమైన తాత్త్విక విషయాలు వివరించబడ్డాయి. తరువాత జీవునిలో అంతర్యామిగా ఉన్న ఇంద్రుని గుర్తించడం, అహంకారాన్ని సమర్పించడం, మనస్సు యొక్క బంధనస్వభావాన్ని అధిగమించడం మరియు ఆత్మసాక్షాత్కారానికి దారితీసే వివిధ యోగమార్గాలు ఉపదేశించబడ్డాయి.


ఈ విధంగా "ఇంద్ర గీతము" భక్తి, వేదతత్త్వం, ఆత్మవిచారం మరియు యోగసాధనలను సమన్వయపరుస్తూ, ఇంద్రుని బాహ్య దేవతగా మాత్రమే కాకుండా సాధకుని అంతరంగంలో ప్రకాశించే పరమ దివ్యశక్తిగా దర్శింపజేసే విశిష్టమైన రచన.


॥ కావ్యకంఠ వాసిష్ట శ్రీ గణపతి మునిచే తెలుగులో ప్రత్యేకముగా రచింపబడిన ఇంద్ర గీతము ॥


మొదటి స్తబకము


మంగళనాముని మంగళయశుని ।

మంగళరూపుని మఘవంతుఁతలఁతు ॥౧॥


మంజులద్విపదల మరుదవనీశ ।

యంజలినింపి నీకర్పింతుఁగొనుము ॥౨॥


లలితసంస్కృత మంత్రలాలిత! యిపుడు ।

తెలుగున ద్విపదల దేవేంద్ర ! వినుము ॥౩॥


ఋక్కులోరుచి నిర్జరేంద్రుడా! తెలుఁగు

వాక్కులో విన నీకు నిక్కము తెలియు ॥౪॥


పరమాత్మయు ఇంద్రుఁడును:


భువనము సృజియించి భువనాది పరుఁడు ।

భువనాంతరాత్మయై పురుహూతుఁడయ్యె ॥౫॥


భువనాదియున్నాఁడు భువనముదాఁటి ।

భువనాంతరాత్మ యీభువనమునందు ॥౬॥


భువనాంతరాత్మకు భువనాదితోడ ।

వ్యవహారదశయందె యరయ భేదంబు ॥౭॥


ఆత్మయే భువనాల కాదిమూలమగు ।

నాత్మయే భువనాంతరాత్మయై యొప్పు ॥౮॥


అతఁడు తానొక్కఁడే యావలవెలుఁగు ।

నతఁడుండు నిక్కడ నఖిలముగూడి ॥౯॥

అదిమూఁడుపాళ్ళట యభవురూపాన ।

నిదియొక పాలఁట ఋషులు గన్గొనిరి ॥౧౦॥


అది నిర్గుణంబగు నవికల్పచిత్తి ।

యిది సగుణంబగు నింద్రవిభూతి ॥౧౧॥


నిరుపాధి యచ్చట నిర్గుణబ్రహ్మ ।

కరుణసోపాధియౌ పురుహూతుఁడిచట ॥౧౨॥


ఆతఁడతీతుండగు నఖిలాండములకు ।

నితఁడేలు శక్తిచే నీదృశ్యకోటి ॥౧౩॥


ఆత్మయే లోకమౌ నావలజూడ ।

నాత్మకు లోకములంగములిచట ॥౧౪॥


యాధార మాత్రమే యాతఁ డన్నిటికి ।

నాధికారిక దేవతాత్మయితండు ॥౧౫॥


విభుని రెండువిధాల విశ్వకారణుని।

విభజించి చెప్పిరి విద్వాంసులిట్లు ॥౧౬॥


ఇంద్రజనన ప్రస్తావము:


జనులార! బ్రహ్మము, జంబాంతకుఁడును।

జనకుఁడు, కొడుకును జతురులభాష ॥౧౭॥


భువనము సకలము పుట్టించువాని।

భువనప్రవేశము పుట్టుకయనిరి ॥౧౮॥


అట్టి చిత్రంబగు పుట్టుకయందు।

పట్టికి నీ దేవపదవియేతల్లి ॥౧౯॥


అదితి నీతల్లి యీ యాకాశ సతియె ।

సదయ! నీతండ్రి కశ్యపుడు బ్రహ్మంబె ॥౨౦॥


ఖండము దితియగు ఖవిశాలవాటి ।

ఖండవిహీన యాఖండల యదితి ॥౨౧॥


పశ్యకుఁ డక్షరవ్యత్యాసరీతి ।

గశ్యవుఁ డయ్యెను గవిసూక్తులందు॥౨౨॥


కవియు విప్రుఁడునగు కశ్యపుఁడన్యు ।

డవనిఁబుట్టిన వ్యక్తి యజర! నీబంటు॥౨౩॥


జనకుని నీకిట్లు జననితోఁ గూడ ।

ఘనవాహ! సుకవులు కల్పించిరయ్య॥౨౪॥


శక్తుఁడు శక్తియును:


ఆత్మయే శక్తుఁడౌ నాత్మయేశక్తి ।

యాత్మశక్తి విభేదమౌపచారికము ॥౨౫॥


ఆత్మమహాబ్దిలో నభిమానియైన ।

యాత్మాణి మాంశమే యగును శక్తుండు ॥౨౬॥


ఆ పయోరాశిలో ననుభూతియైన ।

వ్యాపకమహిమయే యాతనిశక్తి ॥౨౭॥


సత్తులోమూలమే శక్తభాగంబు ।

సత్తులోశాఖలే శక్తి భాగంబు ॥౨౮॥


ధర్మిభూతజ్ఞాన తత్త్వమొకండు ।

ధర్మభూతజ్ఞాన తత్వమింకొకటి ॥౨౯॥


విభజనాశక్యము విబుధోక్తులందు ।

విభజింపఁబడి యిట్లు ద్వివిధమైతోఁచు ॥౩౦॥


వాక్య నిష్ణాతుల వైఖరివలన ।

నైక్యాన భాసించె నజ్ఞులకు భిద ॥౩౧॥


పరపురుహూతుల భాగించినట్లు ।

ఇరువుర శక్తుల నిరుశక్తులనిరి ॥౩౨॥


ఆమెవిశ్వాతీత యానందరూప ।

యీమె విశ్వంబున కీశ్వరురాలు ॥౩౩॥


ఆతఁడే యీతఁడై యఖిలమునేలు ।

నాతనిశక్తియే యీతని శక్తి ॥౩౪॥


శక్త శక్రాఖ్యలు సదృశార్ధకములు ।

శక్తి శచ్యాఖ్యలు సదృశార్ధకములు ॥౩౫॥


ఇంద్రునివేఱు విభూతులు:


అండాలఁబాలించు నాఖండలుండె ।

మండలాంతరవర్తి మహనీయుఁడయ్యె ॥౩౬॥


బ్రహ్మాండ జాలంబు పాలించునతఁడు ।

బ్రహ్మాండ మొక్కటి పాలించు నితఁడు ॥౩౭॥


పురుహూత సవితలు పూర్వులభాష ।

హర కేశవులు వీరలధునాతనోక్తి ॥౩౮॥


కాలంబు పరిణామ కారణ మమిత ।

లీలంబు వేఱింద్ర లీలావిభూతి ॥౩౯॥


మేఘాలఁగన్పట్టు మింటి తేజస్సు ।

మోఘేతరము వేఱుముఖ్య విభూతి ॥౪౦॥


రెండవ స్తబకము

జీవతత్త్వము:


ప్రతిబింబ రూపానఁబ్రతిదేహియందు ।

ప్రతిఫలించితివీవు పరమేశయిచట ॥౪౧॥


ఉన్నావు మాలోన యోగులవలన ।

విన్నాము, వినిమేము వెతకిచూచితిమి ॥౪౨॥


వెతకెడు బుద్ధికి వేరౌదునీవు ।

వెతకఁగ వెతకఁగ విబుధేంద్ర తెలిసె ॥౪౩॥


అహంకారనింద:


నీవు నీమదియైన నిఖలేంద్రుకంటె ।

నీవుభిన్నుండవు నిజము మానవుఁడ ॥౪౪॥


ఆక్రమించెడు నప్పుడహమును మనము ।

శక్రుడంతర్యామి సలుపఁడుచర్చ ॥౪౫॥


గుహలోపలకుబోయి గుప్త దేవునకు ।

నహమును మానస మర్పింపవలయు ॥౪౬॥


అది వానిసొత్తగు నదిగాదుతనది ।

మదియట్లు సేయుట మహిన్యాయమగును ॥౪౭॥


అతని వస్తువుదెచ్చి యతని కీయకయె।

సతతము వాడుట సరిగాదు మదికి ॥౪౮॥


ఆపాపమే మూల మఘముల కెల్ల ।

నాపాపము భవాన నందఱిఁగట్టె ॥౪౯॥


ఆపాపమే యుత్తమాధమవాది ।

యా పాపము హసించు నద్వైతబోధి ॥౫౦॥


అడుగఁగఁదన సొత్తునాతండురాఁడు ।

విడువదు చిత్తము వెఱ్ఱియైతాను ॥౫౧॥


మనోభవాది వర్ణనము:


మనసుచూచినఁదాను మఱిచూడలేడు ।

మనసుచూడఁగ లేదు మఱితానుజూడ ॥౫౨॥


ఇది తాను వీక్షింప నది శయనించు ।

నది తాను వీక్షింప నిది లయమందు ॥౫౩॥


ఒక్కటి శిరసుననుండి భక్షించు ।

నొక్కటి హృదయాన నుండి వెలుంగు ॥౫౪॥


భక్షించి భక్షించి పరితృప్తి లేక ।

శిక్షించి మమ్మిది చేయించుఁబనుల ॥౫౫॥


దీనిరాజ్యంబున దీనులౌమమ్ము ।

దీనావన! మహేంద్ర! దేవ! కాపాడు ॥౫౬॥


మాశక్తి లేకయే మఱి సాగలేదు ।

మాశక్తిని హరించి మమ్ము బాధించు ॥౫౭॥


మేము భావింతుము మేముందు మయ్య ।

మామనస్సు నశించ మా కేమి మేలు ॥౫౮॥


ఈ ప్రకారంబున నీతిబాధలను ।

నీప్రతిరూపము ల్నిత్యము పడఁగ ॥౫౯॥


శోచింపకేమియు సురరాజ! దివిని ।

చూచుచునుండుట శోభయానీకు ॥౬౦॥


నిన్ను నన్నుఁగ జేసి నిర్జరనాథ ।

మిన్నునగూర్చుండి మేలెంచవేమి? ॥౬౧॥


ప్రతిరూపమునఁజిత్తి ప్రసరింపనేల ।

పతితపావన! దాని బంధింపనేల ॥౬౨॥


తనరూపుబంధింపఁదన కేది యశము ।

ఘనవాహ! నీవిది గమనింపలేదొ ॥౬౩॥


కొన్ని యోగ మార్గములు:


చేదైన విషయాలఁజిత్తము విడిచి ।

నీదు ప్రక్కకు వంగి నిర్జరేశ్వరుఁడ ॥౬౪॥


యోచింప యోచింప నుదయించుశక్తి ।

యాచింప యాచింప నలవడుభక్తి ॥౬౫॥


తలనుండి స్వహృదయస్థలము చూచుటయె ।

బలవైరి ప్రక్కకు వంగుటయగును ॥౬౬॥


తనమూలమును బుద్ధి తర్కించుటొకటి ।

తనబుద్ధినే తాను దర్శించుటొకటి ॥౬౭॥


నిన్ను భజించుట నిఖిలేంద్రయగును ।

దన్ను విడిచిన నేదితపము లోకాన ॥౬౮॥


ఆత్మప్రతీతియే యప్రమాదమగు ।

నాత్మను మఱచుట యగుఁబ్రమాదంబు ॥౬౯॥


అప్రమాదము యోగ్యమన్నింటికన్న ।

అప్రమత్తుఁడు నిన్నే హరిహయ! చేరు ॥౭౦॥


నిన్ను జేరుటయనంగ నిర్జరనాథ! ।

తనయందు నిలుచుట తాత్పర్యమండ్రు ॥౭౧॥


తనపట్టు విడుచుచుఁదలఁచుట భవము ।

తనపట్టు విడువక తలచుట తపము ॥౭౨॥


తనచోట నుండుట తలఁపులులేక ।

ఘనవాహ ! నీయందు ఘనమగు నిష్ఠ ॥౭౩॥


చూపునే చూచెడి శుద్ధయోగులకుఁ ।

బాపహారిపరుండు ప్రత్యక్షమగును ॥౭౪॥


కొండనాలుక బుద్ది కూర్చుండనిండు ।

పిండాననిది శక్రవేశ్మమ్ము నుండు ॥౭౫॥


ఆధారమందలి యణువైన యగ్ని ।

యాధారముగ దృష్టినతి యుక్తి దింపి ॥౭౬॥


చింతింపు మింద్రుని జిత్తమువంచి ।

సంతతమిది పంథ సర్వసిద్ధులకు ॥౭౭॥


ప్రాణనిత్యహార పరిశోథకుఁడగు ।

ప్రాణి కింద్రుని శక్తి ప్రత్యక్షమగును ॥౭౮॥


శిరమును స్థిరముగాఁజింతించు మునికి ।

పరమగు లోపలి వస్తువు చిక్కు ॥౭౯॥


శక్తుని విశ్వప్రసారిణి శక్తి ।

భక్తుని తనువులోఁ బ్రవహించుఁగాత ॥౮౦॥


॥ ఇది శ్రీ భగవన్మహర్షి రమణాంతేవాసియు నరసిమ్హ పుత్రుడునుయగు గణపతిముని ప్రణీతమౌ ఇంద్ర గీతం సంపూర్ణం ॥

bottom of page